Monday, July 15, 2019

పాపం శ్రీహరి కొడుకు

హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్.. ఇలా పలు రకాల పాత్రలతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు శ్రీహరి. మోహన్ బాబు తర్వాత అంత విలక్షణమైన నటనతో తాను చేసిన ప్రతి పాత్రతోనూ మెప్పించిన నటుడాయన. ఆరేళ్ల కిందట కెరీర్ మంచి ఊపులో ఉండగా హఠాత్తుగా ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.

తన కొడుకుల్లో ఒకరిని దర్శకుడిగా చూడాలని, మరొకరిని హీరోను చేయాలని ఆయన కోరిక. ఇందులో భాగంగానే ఓ కొడుకైన మేఘాంశ్ హీరోగా మారాడు. అతను కథానాయకుడిగా పరిచయం అయిన సినిమా ‘రాజ్‌దూత్’. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ సినిమాకు కనీస స్పందన కరవైంది.

ముందు నుంచి ‘రాజ్ దూత్’పై ఎలాంటి బజ్ లేదు. సినిమాను సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయారు. మేఘాంశ్ పట్ల జనాల్లో ఆసక్తి కలిగించలేకపోయారు. ‘రాజ్ దూత్’ టీజర్, ట్రైలర్ కూడా ఏమంత ప్రత్యేకంగా లేకపోయాయి. దీనికి తోడు ఇంకో రెండు సినిమాల పోటీ మధ్య దీన్ని రిలీజ్ చేశారు. ‘నిను వీడని నీడను నేనే’, ‘దొరసాని’ సినిమాలకే బజ్ అంతంతమాత్రంగా ఉంది. ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా వచ్చాయి. ‘రాజ్ దూత్’నైతే జనాలు పట్టించుకోనేలేదు.

ఈ సినిమా గురించే ఎక్కడా చర్చ లేదు. రివ్యూలు కూడా కనిపించడం లేదు. సినిమా చూసిన వాళ్లు పెదవి విరుస్తున్నారు. తన సినిమా రిలీజ్ సందర్భంగా మేఘాంశ్ చాలా ఎమోషనల్‌గా ఓ లేఖ రాశాడు. అది కూడా ప్రేక్షకుల్ని కదిలించలేకపోయింది. థియేటర్లకు రప్పించలేకపోయింది. మొత్తానికి ‘రాజ్ దూత్’ వల్ల మేఘాంశ్ ఏ ప్రయోజనం లేదని తేలిపోయింది. శ్రీహరి ఉండుంటే ఆయన కొడుకు లాంచింగ్ ఇలా చేయనిచ్చేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Source : gulte.com

No comments:

Post a Comment