Friday, June 28, 2019

సినిమా రివ్యూ: కల్కి

వెండితెరపై 'అ'తో మొదటి సంతకం చేసిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే తన ఆలోచనలు 'అం'దరిలా వుండవనిపించుకున్నాడు. రెండవ చిత్రానికి వెటరన్‌ యాక్టర్‌ రాజశేఖర్‌ని ఎంచుకోవడం, కల్కి అనే టైటిల్‌ పెట్టడం... ఆసక్తిని రెట్టింపు చేసే టీజర్‌ కట్‌ చేయడం వరకు ఈసారి 'ఆ'శ్చర్యపరిచే రెండో ప్రయత్నం సిద్ధం చేస్తున్నాడనిపించాడు. కల్కి మొదలైన కాసేపటి వరకు ఒక కొత్త అనుభూతిని కలిగించడంలో, ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడంలో ప్రశాంత్‌ తన టాలెంట్‌ చూపించాడు.
కొల్లాపూర్‌ బ్యాక్‌స్టోరీ అంతా వాయిస్‌ ఓవర్‌లో రివీల్‌ చేసిన తర్వాత శేఖర్‌బాబు వల్ల ఆ ఊరికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని చెబుతారు. ఆ శేఖర్‌బాబు ఎవరో తెలుసుకునేలోగా అతను హత్యకి గురవుతాడు. ఆ హత్య వెనుక మిస్టరీని చేధించడానికి కల్కి ఐపిఎస్‌ (రాజశేఖర్‌) వస్తాడు. అప్పటికే ఆ ఊరి గురించి పరిశోధన చేస్తోన్న జర్నలిస్ట్‌తో (రాహుల్‌ రామకృష్ణ) కలిసి శేఖర్‌బాబు హత్య తీగ లాగితే అడవిలో తగలబడిపోయిన ఒక కోన దులుతుంది. మరో చోట గల్లంతయిన మూడు లాంచీలు, అరవై ప్రాణాలు తేలుతాయి.
అసలేం జరిగింది? ఇన్ని హత్యల వెనుక వున్నదెవరు? మామూలుగా అయితే మిస్టరీ ఇంకా ఇంకా చిక్కబడుతూ, ఇన్వెస్టిగేషన్‌ మరింతగా కట్టిపడేయాలి. కానీ దర్శకుడు ఎంచుకున్న స్టయిలిష్‌ టేకింగ్‌కి తోడు, అక్కర్లేని హీరోయిజం, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ 'కల్కి'ని ఇంకా ఇంకా పలుచన చేసాయి. విక్రమార్కుడి విలన్‌ని తలపించే విలన్‌ (ఆశుతోష్‌ రాణా) ఆ ఊరి ఆడవాళ్లని చెరబడుతుంటాడు. అది కాకుండా అతను చేసే అరాచకాలు కానీ, అతడిని రాక్షసుడంటూ చెప్పుకునే దానికి అంతలా భయపెట్టే సంఘటనలు కానీ అతను చేస్తున్నట్టు కనిపించడు. దానికి తోడు కథానాయకుడు దేన్నయినా సాధించగల అపర కల్కి అవతారుడు అన్నట్టుగా చూపించడంతో అతను ఎలాంటి ప్రదేశానికి వెళ్లినా ఎటువంటి ఆందోళన కానీ, ఉత్కంఠకి కానీ తావుండదు. రహస్యం చేధించడానికి వెళ్లిన ప్రతి చోట మిస్టరీ ఏమిటనేది కళ్లతో చూసి చెప్పేస్తూ వుంటాడు కనుక అటు అతడు కానీ, అతడిని వెంటాడే ప్రేక్షకుల దృష్టి కానీ కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ కనిపించదు.
ఏమి జరిగిందనేది తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించలేకపోతోన్న కథనం అనవసరంగా పక్క దారులు పట్టడం కూడా కల్కి ఇన్వెస్టిగేషన్‌ని ఇంకాస్త డైల్యూట్‌ చేస్తాయి. పూర్తిగా మిస్టరీపైనే ఫోకస్‌ వుంచాల్సిన టైమ్‌లో బ్రేక్‌ తీసుకుని హీరో లవ్‌స్టోరీని చెప్పడానికి కులుమనాలి వెళ్తుంది. పోనీ ఆ ప్రేమకథలో ఏదైనా ఆకట్టుకునే లక్షణం వుంటుందా అంటే అదేం ఉండదు. 'మీకూ ఓ బ్రేక్‌ అవసరం' అంటూ ప్రేక్షకులతో కమ్యూనికేట్‌ చేస్తున్నట్టు ఓ పాటకి చోటిచ్చారు. పోనీ ఈ ప్రేమకథని అయినా అంతటితో ముగించేస్తారా అంటే అదీ చేయరు. ఇంటర్వెల్‌ తర్వాత మరో పాట కోసం మిగతా భాగం దాచి పెట్టారు. ఆ భాగం పూర్తయిన తర్వాత అర్థం లేని ఒక ఐటెమ్‌ సాంగ్‌ అత్యంత వల్గర్‌ డాన్స్‌ మూవ్‌మెంట్స్‌తో ఎందుకోసం పెట్టారనేది దర్శకుడికీ తెలీదు. అందుకే ఆ పాట పూర్తయ్యాక తన మీద తానే ఓ సెటైర్‌ వేసుకున్నాడు.
పూర్తిగా అవసరమే లేని ఈ లవ్‌స్టోరీని ఎడిట్‌ చేయడంతో పాటు... స్లో మోషన్‌లో జరిగే యాక్షన్‌ సీన్స్‌, హీరో తాలూకు బిల్డప్‌ సీన్స్‌ అన్నీ రెగ్యులర్‌ స్పీడ్‌లో చూపించినట్టయితే 'కల్కి' రన్‌ టైమ్‌ ఒక గంట తగ్గి ఇన్వెస్టిగేషన్‌ కాస్త వేగవంతమయి దీని కంటే బెటర్‌గా ఎంగేజ్‌ చేసి వుండేది. ఎలాంటి ఎమోషనల్‌ ఇంపాక్ట్‌ లేకుండా సాగే విలన్‌ త్రెడ్‌కి కనీసం పే ఆఫ్‌ కూడా ఇవ్వకుండా సింపుల్‌గా ముగించేసారు. ఆ మాత్రం దానికి అతడికి అంత బిల్డప్‌ దేనికో... ఫుటేజీ దంగడ కాకపోతే! ప్రథమార్ధంలో చిక్కుముడులు బిగుసుకునే కొద్దీ ఆకట్టుకోవాల్సిన కల్కి ఆ చిత్రీకరణతో పాటు కొన్ని పాత్రల కాస్టింగ్‌ వల్ల ఏమాత్రం ఎఫెక్టివ్‌గా అనిపించదు. దర్శకుడు తనపై తానే జోక్‌ వేసుకుంటున్నాడా లేక కమర్షియల్‌ సినిమాలపై సెటైర్‌ వేస్తున్నాడా తెలియకుండా ఇచ్చిన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కల్కిపై ఆసక్తిని సగానికి తగ్గించేస్తుంది.
క్లయిమాక్స్‌కి ముందు కానీ మళ్లీ సీరియస్‌నెస్‌ రాదు. కల్కి అనే టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఇస్తూ చివర్లో హీరోకి సంబంధించిన మిస్టరీని చూపించే దృశ్యాలు కాస్త మెరుగ్గా అనిపిస్తాయి. ఈ చిత్రాన్ని సీరియస్‌ టోన్‌లో మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా తీసినట్టయితే ఖచ్చితంగా మెరుగైన అనుభూతిని ఇచ్చి వుండేది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లైటింగ్‌ నిజంగా ఆ సన్నివేశం మధ్యలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అలాగే నేపథ్య సంగీతం కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపించినా పలు సందర్భాల్లో థ్రిల్‌ చేస్తుంది. ప్రొడక్షన్‌ డిజైన్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ స్టయిలిష్‌ టేకింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాడు. అది ఓకే కానీ ఈ చిత్రాన్ని కమర్షియల్‌గా ప్రెజెంట్‌ చేయాలనే ఆరాటం దేనికో అర్థం కాలేదు.
రాజశేఖర్‌ రియలిస్టిక్‌ అప్రోచ్‌ని ఎంకరేజ్‌ చేసి వుండాల్సింది. ఓవర్‌ హీరో గ్లోరిఫికేషన్‌ ఈ చిత్రానికి చేటు చేసింది. రాహుల్‌ రామకృష్ణ కొంతవరకు అలరించాడు. అశుతోష్‌ రాణా ఆహార్యం బాగా కుదిరింది. ఆదా శర్మ పాత్రని కుదిస్తే చాలా సమయం, డబ్బు ఆదా అయ్యేది. నందిత శ్వేత పాత్రకి చివర్లో ప్రాధాన్యత దక్కింది. ముఖ్య తారాగణం వరకు తమ వంతు న్యాయం చేసినా కానీ నటీనటులు పూడ్చి, సినిమాని లిఫ్ట్‌ చేయగలిగేటన్ని తక్కువ హోల్స్‌ అయితే కావివి.
మంచి సెట్టింగ్‌ కుదిరినా, ఎంగేజ్‌ చేసే ప్లాట్‌ వున్నా ఆకట్టుకునేలా లేని కథనం, అతి వాడిన స్లో మోషన్‌ (హైస్పీడ్‌) టెక్నిక్‌, అవసరం లేని సబ్‌ ప్లాట్స్‌ (ఆదా శర్మ త్రెడ్‌) కల్కిని విషయం తక్కువ, హడావిడి ఎక్కువ సినిమాగా మార్చాయి.

No comments:

Post a Comment