Thursday, February 27, 2020

ఆ క్రేన్ నా మీద పడ్డా బాగుండేదే-శంకర్

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తీవ్ర శోకంలో ఉన్నాడు. అతడితో చాలా ఏళ్లుగా ప్రయాణం చేస్తున్న, అత్యంత సన్నిహితులైన ఇద్దరు అసిస్టెంట్లను అతను కోల్పోవాల్సి వచ్చింది. ‘ఇండియన్-2’కు పని చేస్తున్న మరో టెక్నీషియన్‌ కూడా ఆయనకు దూరమయ్యాడు. ఈ ముగ్గురూ ఆయన కళ్ల ముందే క్రేన్ మీద పడి చనిపోయారు.

శంకర్ జీవితంలోనే ఇది అతి పెద్ద విషాదం అని.. ఆయన తీవ్రమైన శోకంలో ఉన్నాడని సన్నిహితులు చెబుతున్నారు. గత వారం రోజులుగా ఆయన ఈ ట్రామాను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే కాస్త తేరుకున్న శంకర్ ఆ విషాద ఘటనపై స్పందించాడు. ట్విట్టర్లో ఒక ఉద్వేగభరితమైన మెసేజ్ పెట్టారు. తాను ఆ ఘటన జరిగినప్పటి నుంచి పెద్ద షాక్‌లో ఉన్న విషయాన్ని శంకర్ ఈ ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఇంకా దాన్నుంచి పూర్తిగా కోలుకోలేదని చెప్పాడు.

ఈ విషాదం గురించి చెప్పడానికి తన దగ్గర మాటలు లేవని.. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్ని కోల్పోయానని.. ఈ బాధ తీరనిదని శంకర్ చెప్పాడు. తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని.. కానీ ఆ క్రేన్ ఏదో తన మీద పడి ఉన్నా బాగుండేదని శంకర్ నిర్వేదంతో మాట్లాడాడు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి తాను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు కూడా శంకర్ తెలిపాడు.

మృతుల కుటుంబాలకు ‘లైకా ప్రొడక్షన్స్’ అధినేతలతో పాటు కమల్ కూడా ఆర్థిక సాయం ప్రకటించగా.. శంకర్ కూడా వ్యక్తిగతంగా వాళ్లకు చేయగలిగింది చేస్తున్నట్లు సమాచారం. ఆ కుటుంబాల బాధ్యతను ఆయన తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. షూటింగ్ సందర్భంగా సరైన రక్షణ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలపై చెన్నై పోలీసులు శంకర్, కమల్ హాసన్‌లతో పాటు నిర్మాతల్ని కూడా విచారిస్తున్నారు.

No comments:

Post a Comment