Wednesday, September 16, 2015

మల్లారెడ్డి మంత్రిపదవికోసం ఎర్రబెల్లి పైరవీలా?

తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ గా ఉన్న ఒకే ఒక్కడు మల్లారెడ్డి. పలు విద్యాసంస్థలకు అధినేత అయిన మల్లారెడ్డి.. రాజకీయ అరంగేట్రంలో తన తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయిపోయారు. తాజాగా ఆయనకేంద్రమంత్రి పదవి మీద కూడా కన్నేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలంటే, ఈ ప్రాంతంనుంచి కూడా పార్టీకి ఒక కేంద్రమంత్రి పదవి అయినా ఉండాలనే విధంగా అధినేత ముందుకు ప్రతిపాదనలు తీసుకువెళుతున్నారు. అంటే ఇక పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ మల్లారెడ్డి గనుక.. ఆయనకు కేంద్రంలో ఏదో ఒకస్థాయిలో మంత్రి పదవి ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అన్నమాట. ఇలా మల్లారెడ్డికి పదవి ఇప్పించడానికి ఎర్రబెల్లి దయాకరరావు ఇండైరక్టు పైరవీలు చేస్తుండడం విశేషం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో యావత్‌ తెలంగాణలో.. దాదాపుగా తెరాస అనుకూలంగా ప్రజాతీర్పు వెలువడే పరిస్థితిని పార్టీలు ముందే అంచనా వేశాయి. సెటిలర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందువలన.. తెదేపాకు అనుకూలత ఉంటుందని భావించే మల్కాజ్‌గిరి సీటును తీవ్రమైన పోటీ మధ్య తనకు దక్కించుకోవడమే మల్లారెడ్డి తొలి విజయంగా అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. పైగా ఆ నియోజకవర్గంలో జయప్రకాశ్‌నారాయణ్‌, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వంటి అనేక మంది ప్రముఖులు పోటీ పడినా కూడా.. మల్లారెడ్డి విజయం సాధించారు. ఆయన లక్‌ఏంటంటే.. మొత్తం తెలంగాణలో మరో తెదేపా ఎంపీ గెలవకపోవడం. పైగా భాజపాకు కూడా ఒకే ఎంపీ ఉండడం. కాబట్టి ఎలాంటి కాంబినేషన్లు సెట్‌ చేసినా.. తెలంగాణ కోటాలో రెండు ఇవ్వదలచుకున్నా సరే.. మిత్రపక్షం గనుక.. తనకు ఒక మంత్రిపదవి గ్యారంటీ అని మల్లారెడ్డి కలగన్నారు. కానీ అది జరగలేదు. చంద్రబాబు కూడా పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. నిజానికి మధ్యలో ఒకసారి తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్‌ వంటి ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడనే లేదంటూ తెగ కీర్తించారు. స్వయానా తన వియ్యంకుడు తీగల కృష్ణారెడ్డి కూడా తెదేపానుంచి తెరాసలోకి పార్టీమారిపోయి ఉన్న నేపథ్యంలో.. మల్లారెడ్డి కూడా అటువైపు చూస్తున్నాడా అనే విమర్శలు వచ్చాయి. అయితే.. ఆయన గులాబీతీర్థం పుచ్చుకోలేదు గానీ.. తెదేపాలోనే ఉండి ఇంకా మంత్రి పదవి అవకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా విజయవాడకు వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన తెలుగుదేశం నాయకుల్లో ఆయన కూడా ఉన్నారు. పైగా చంద్రబాబుతో ఎర్రబెల్లి.. తెలంగాణ నుంచి తమ పార్టీ నేతలు ఎవ్వరికీ కేంద్రమంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేయడం కూడా ఆయన కోసమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎంతగా ఎర్రబెల్లి పైరవీ చేసినా.. చంద్రబాబు, మల్లారెడ్డికి మంత్రిపదవి ఇప్పించడం కల్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment