Tuesday, December 19, 2017

బాల‌య్యా.. మీ *తెలుగు* అదిరిందండీ!

నంద‌మూరి బాల‌కృష్ణ‌... తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరోనే కాకుండా... న‌వ్యాంధ్ర శాస‌న‌స‌భ‌లో అనంత‌పురం జిల్లా హిందూపురం శాస‌న‌స‌భా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ప్ర‌తినిధిగానూ ఉన్నారు. ఇటు సినిమాల‌తో పాటు అటు రాజ‌కీయంగానే బాల‌య్య ఇప్పుడు బాగానే రాణిస్తున్నార‌ని చెప్పాలి. క‌రువు జిల్లా అనంత‌పురంలోని హిందూపురం నియోజక‌వ‌ర్గాన్ని ఎంచుకునేందుకు త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు ప్రాతినిథ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గ‌మ‌న్న కార‌ణమైనా... ఇప్పుడు అక్క‌డ అభివృద్ధిని బాల‌య్య ప‌రుగులు పెట్టిస్తున్నార‌నే చెప్పాలి.

గ‌త చ‌రిత్ర‌గానే మిగిలిపోయిన లేపాక్షి ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించిన బాల‌య్య‌... ఒక్క హిందూపురానికే కాకుండా అనంత‌పురం జిల్లాకే మంచి గుర్తింపు తీసుకొచ్చే ప‌నిని దిగ్విజ‌యంగానే పూర్తి చేశారు. రాజ‌కీయాల‌కు కొత్త‌నే అయినా... తొలి సారి ఎమ్మెల్యేగానే ఆయ‌న చేస్తున్న కార్య‌క్ర‌మాలు నిజంగానే ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా ఇప్పుడు బాల‌య్య గురించి ఇంత‌గా చెప్పుకోవాల్సిన అవ‌సరం ఏమొచ్చిందంటే... ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లే ఆ అవ‌కాశాన్ని క‌ల్పించాయ‌ని చెప్పాలి.

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాదు వేదిక‌గా జ‌రుగుతున్న ఈ స‌భ‌ల‌ను జ‌నం తెలుగు మ‌హాస‌భ‌లుగా కాకుండా తెలంగాణ మ‌హాస‌భ‌లుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌పంచ తెలుగు మహాస‌భ‌ల పేరిట జ‌రుగుతున్న ఈ స‌భ‌ల్లో... నవ్యాంధ్ర‌కు చెందిన ఏ ఒక్క ర‌చ‌యిత పేరు గానీ, ఏ ఒక్క రాజ‌కీయ నేత పేరు గానీ, ఏ ఒక్క భాషా ఉద్య‌మ‌కారుడి పేరు గానీ ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. ఇక నిన్న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించిన కేసీఆర్ స‌ర్కారు... వారికి ఘ‌నంగా స‌న్మానం చేసింది. ఈ స‌న్మానం అందుకున్న వారిలో నంద‌మూరి న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారంద‌రూ... మెగాస్టార్ చిరంజీవి సహా తెలంగాణ స‌ర్కారును, కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను పొగ‌డ‌టంతోనే స‌రిపెట్టారు. అయితే అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన బాల‌య్య‌... త‌న ధీరోదాత్త ప్ర‌సంగంతో నిజంగానే ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లను పుల‌కింప‌జేశార‌నే చెప్పాలి. స‌న్మానం అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి ప్ర‌సంగం త‌ర్వాత మైకందుకున్న బాల‌య్య‌... ప్ర‌సంగం మొద‌ట్లోనే తెలుగు భాష పుల‌కించే వ్యాఖ్య‌లు చేశారు. *ప్రాంతాలు వేరైనా... స్నేహ భావాన్ని వీడ‌ని నా తెలుగు ప్ర‌జానీకానికి* అంటూ మొద‌లెట్టిన బాల‌య్య‌... త‌న ప్ర‌సంగం మొత్తాన్ని అచ్చ తెలుగులో కొన‌సాగించారు.

అంతేకాకుండా మైకందుకున్న ప్ర‌తి ఒక్క‌రూ తెలంగాణ స‌ర్కారును, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను పొడిగిన త‌ర్వాత గానీ ప్ర‌సంగం మొద‌లెడితే.. బాల‌య్య మాత్రం అందుకు విరుద్ధంఆ ముందుగా భాషాకు న‌మ‌స్కారం చేస్తూ ప్ర‌సంగం మొద‌లుపెట్టారు. తెలుగు ప్ర‌జ‌ల‌ను, వారి స్నేహ‌పూర్వ‌క వైఖ‌రిని ప్ర‌స్తుతిస్తూ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. అస‌లు ఈ స‌భ‌ల‌ను  ఏర్పాటు చేసిన కేసీఆర్‌, తెలంగాణ స‌ర్కారును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు బాల‌య్య అంత‌గా శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చ‌లేద‌నే చెప్పాలి. అంతేకాకుండా తెలంగాణ స‌ర్కారు విస్మ‌రించిన ఆంధ్రుల ఆరాధ్య న‌టుడు, దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు పేరును కూడా త‌న ఏడు నిమిషాల ప్ర‌సంగంలో మూడు సార్లు ప్ర‌స్తావించారు. అంతేకాకుండా ఓ తెలుగు రాష్ట్ర సీఎంగా ఉన్న త‌న బావ‌, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి పేరును కూడా బాల‌య్య ఈ వేదిక మీద చాలా ధైర్యంగా ప‌లికారు.

ఇక తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన న‌వ్యాంధ్ర‌కు చెందిన ప‌లువురు క‌వులు, భాషా కోవిదుల పేర్ల‌ను కూడా తెలంగాణ ప్ర‌ముఖుల‌తో క‌లిపి బాల‌య్య ప్ర‌స్తావించారు. ప్ర‌కాశం పంతులు, అల్లూరి సీతారామారాజు, బూర్గుల రామ‌కృష్ణారావు త‌దిత‌రుల పేర్ల‌ను బాల‌య్య పేర్కొన్నారు. అంతేకాకుండా తెలుగు భాషా ఔన్న‌త్యాన్ని వివ‌రించిన బాల‌య్య‌... తెలుగు భాష‌లో గోదావ‌రి ఒంపులు, కృష్ణ‌వేణి సొంపులు, నెల్లూరి నెర‌జాణ‌త‌నం, రాయ‌ల‌సీమ రాజ‌సం, తెలంగాణ మాగాణం ఉన్నాయ‌ని,  కోన‌సీమ లేత‌ కొబ్బ‌రి నీరు... తెలుగు భాష అంటూ బాల‌య్య ఓ భాషా పండితుడి వ‌లే అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించారు.

తెలుగు భాష‌లోని అక్ష‌రాల సంఖ్య‌ను ప్ర‌స్తావించిన బాల‌య్య‌... 36 అక్ష‌రాలేన‌ని చెప్పారు. అయితే సంస్కృత ప‌దాల‌ను క‌లిపేసుకుని న‌వ తెలుగు భాష‌గా రూపుదిద్దుకున్న భాషలో 55 అక్ష‌రాలున్నాయ‌ని ఆయ‌న చెప్పిన వైనం నిజంగానే ఆయ‌న‌లోని భాషా కోవిదుడిని జ్ఞ‌ప్తికి తెచ్చింద‌నే చెప్పాలి. ఇక ఒక్క ప‌రభాష అక్ష‌రం లేకుండా మూడు నిమిషాల పాటు అచ్చ తెలుగులో ఎంద‌రు మాట్లాడ‌తారో గుండెల‌పై చేయి వేసుకుని చెప్పండి అంటూ బాల‌య్య సంధించిన ప్ర‌శ్నతో ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు నిజంగానే పుల‌కించిపోయాయ‌ని చెప్పాలి.

ఇక విశ్వ‌వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారు ఎంత‌మంది అన్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన బాల‌య్య‌... ఆ సంఖ్య దాదాపుగా 20 కోట్ల మేర ఉంటుందంటూ ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించారు. మొత్తంగా ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల పేరిట ఏర్పాటు చేసిన ఈ స‌భ‌ల్లో ప్ర‌భుత్వాల‌తో సంబంధం లేకుండా బాల‌య్య చాలా ధైర్యంగా చేసిన ఈ ప్ర‌సంగం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. మొత్తంగా త‌న ప్ర‌సంగంలో సింగిల్ ప‌దాన్ని కూడా ప‌ర భాషా ప‌దం లేకుండా అచ్చ తెలుగులో మాట్లాడిన బాల‌య్య‌... మ‌హాస‌భ‌ల‌కు వ‌చ్చిన భాషాభిమానుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసింద‌నే చెప్పాలి.

No comments:

Post a Comment